Parliament : పార్లమెంట్ ఉభయ సభలూ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రధాని మోడీ (Modi) ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం గురువారం మూజువాణీ ఓటుతో వీగిపోయింది. . . దీనికి సంబంధించిన చర్చకు మోడీ లోక్ సభలో సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. అయితే ఆయన ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. మొత్తానికి సభ 39 గంటలు నడిచిందని, ముఖ్యమైన బిల్లులను ఆమోదించడం జరిగిందని స్పీకర్ ఓంబిర్లా (Om Birla) తన చివరి ప్రసంగంలో తెలిపారు.
వీటిలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2023, ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ బిల్లు-2023 వంటివి ఉన్నాయని చెప్పారు. జులై 20 న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచే మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు సభలను స్తంభింపజేస్తూ వచ్చాయి. అనేక సార్లు సభలు వాయిదా పడ్డాయి.
చివరి రోజైన శుక్రవారం లోక్ సభలో హోమ్ మంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశ పెట్టారు. బ్రిటీష్ కాలం నాటి కాలం చెల్లిన క్రిమినల్ చట్టాల స్థానే వీటిని ప్రతిపాదించారు. దేశంలో జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి కఠిన నిబంధనలను ఈ బిల్లుల్లో చేర్చినట్టు ఆయన పేర్కొన్నారు.
ఇక సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ జీ ఎస్టీ చట్టాలకు సంబంధించిన రెండు బిల్లులను చర్చ లేకుండానే సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. ఆన్ లైన్ గేమింగ్, కేసినోలు , హార్స్ రేస్ క్లబ్స్ పై సాగుతున్న బెట్స్ మీద 28 శాతం పన్ను విధించడానికి ఈ బిల్లులు వీలు కల్పిస్తున్నాయి. తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసి కూడా .. ముఖ్యంగా మణిపూర్ అంశంపై మోడీ సభలో మాట్లాడేలా చేయాలన్నతమ ధ్యేయం నెరవేరిందని విపక్షాలు భావిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ (Congress) నేత (Rahul Gandhi) లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో ఆయన పార్లమెంటుకు హాజరయ్యారు.