పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (Parliament session)కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని కేంద్ర మంత్రి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ( Pralhad Joshi) వెల్లడించారు. ఫిబ్రవరి 9 వరకు సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు.
ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడతారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. పార్లమెంట్ లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని వెల్లడించారు.
ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. త్వరలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యంతర బడ్జెట్లో మోడీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మహిళా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం ప్రభుత్వం అదనంగా రూ.12,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ బడ్జెట్లో క్లుప్తంగా 2024-2025 ఆర్థిక నివేదకను ప్రభుత్వం విడుదల చేయనుంది.