పార్లమెంట్‌లో భద్రతా లోపం (Parliament Security Breach) ఘటన నేపథ్యంలో కేంద్రంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఏకంగా పార్లమెంట్ లోపలికి దూసుకు వచ్చి దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఫైర్ అవుతున్నాయి. భద్రతా లోపంపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా ప్రధాని మోడీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఒక ప్రకటన కూడా చేయక పోవడం ఏంటని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు.
ఈ ఘటనపై సభలో పూర్తి స్థాయిలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఈ మేరకు సభలో వాయిదా తీర్మానాన్ని కోరుతూ లోక్ సభ స్పీకర్ కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనలపై లోక్ సభ సెక్రటేరియట్ సీరియస్ అయింది.
ఈ ఘటనకు సంబంధించి ఎనిమది మంది సిబ్బందిపై సస్పెండ్ వేటు వేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక పార్లమెంట్ వద్ద సెక్యూరిటీని భారీగా పెంచారు. కేవలం ఎంపీలను మాత్రమే మకర ద్వారం నుంచి అనుమతిస్తున్నారు. నిందితులు బుధవారం తమ బూట్లలో స్మోక్ క్యాన్స్ తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ కు వచ్చే ఇతర వ్యక్తులను పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
పార్లమెంట్‌లో భద్రత లోపం ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఉగ్ర చట్టాల కింద కేసులు నమోదు చేశారు. వారిని ఈ రోజు న్యాయస్థానం ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.