ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyna) స్పీడ్ పెంచారు. ఓవైపు వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూనే.. ఇంకోవైపు అవినీతి, అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ (PM Modi) కి తాజాగా లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం జరిగిందని.. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు.
పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.35,141 కోట్ల నిధులను వెచ్చించింది. ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్ మాల్ జరిగిందన్నారు పవన్. భారీగా నిధులు పక్కదారి పట్టాయని లేఖలో పేర్కొన్నారు. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోందని.. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారని.. వాస్తవంలో 21,87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారని అన్నారు. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఈ పథకంలో ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందని విమర్శించారు.
‘‘వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసింది. పీఎంఏవై (అర్బన్, రూరల్), జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు. ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 12న 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశం అంటూ ఇచ్చిన పత్రికా ప్రకటనలో దీనికోసం రూ.56,102 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఇది మొదట చెప్పిన లెక్కకు చాలా వ్యత్యాసం. మొదట్లో కేవలం భూ సేకరణ కోసం రూ.35,151 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన లెక్కకు, పత్రికా ప్రకటనలో చెప్పిన లెక్కకు చాలా తేడా ఉంది’’ అని లేఖలో వివరించారు పవన్.
గృహ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం గత ఐదు రాష్ట్ర బడ్జెట్లలో రూ.23,106.85 కోట్ల మేర కేటాయించింది. అయితే దీనిలో వ్యయం చేసింది మాత్రం కేవలం రూ.11,358.87 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై (అర్బన్) పథకం ద్వారా రాష్ట్రానికి రూ.14,366.08 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ మొత్తం పథకంలో ఉన్న అన్ని విషయాలను గమనించి అమలు తీరుపై సీబీఐతోపాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న అవినీతి బయటపడే అవకాశం ఉందన్నారు పవన్ కళ్యాణ్.