జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడో విడత వారాహి యాత్ర విశాఖ (Vizag)లో ముగిసింది. కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఆయన. పార్టీ నాయకులను, ప్రజలను కలుస్తున్నారు. రుషికొండలో అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఎర్రమట్టి దిబ్బల వద్దకు వెళ్లారు. కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారని జగన్ (Jagan) సర్కార్ పై విరుచుకుపడ్డారు. శుక్రవారం వారాహి యాత్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఉత్తరాంధ్రను గుప్పిట్లో పెట్టుకోవడానికి తప్ప విశాఖ రాజధానిపై పాలకులకు ప్రత్యేకమైన ప్రేమ లేదన్నారు పవన్. జనవాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూదోపిడీలకు సంబంధించినవేనని అన్నారు. ఉత్తరాంధ్రపై తనకు అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. సహజవనరులు ఉండి ఇక్కడ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయని.. కాలుష్యం కారణంగా ఎదురవుతోన్న వ్యాధుల వల్ల ఈ ప్రాంతం నష్టపోతోందన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో రేసింగ్ లు ఎక్కువయ్యాయని విమర్శించారు.
ప్రభుత్వంపై కోపం, జనసేన పోరాటం ప్రజల్లో కనిపించిందన్న పవన్.. తెలంగాణ నుంచి ఆంధ్రావాళ్లను తరిమి వేయాలనే కోపం పెరగడానికి జగన్ కూడా కారణమని విమర్శించారు. అందుకే, వరంగల్ లో విద్యార్థులు జగన్ ను రాళ్లతో తరిమికొట్టారని గుర్తుచేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో బిహార్ కంటే ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయని ఆరోపించారు. బాక్సైట్ పేరుతో లేటరైట్ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. అడ్డగోలుగా ఖనిజాలు తవ్వకాలు చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం పదవిపై తన ఆసక్తిని ఇప్పటికే చెప్పానని.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు జనసేనాని. టీడీపీ, జనసేననా? లేక బీజేపీతో కలిసి వెళ్లడమా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. బ్రిటీష్ వాళ్లలా జగన్ ప్రజలను విభజించి పాలిస్తున్నారని, మైనింగ్ దోపిడీ పెరిగిపోయిందని ఆరోపించారు. చిత్తూరులో ఒకేరోజు చాలామంది బాలికలు అదృశ్యం అయ్యారని, దర్యాప్తు చేయాలని కోరితే ఏమీ జరగనట్లే మాట్లాడుతున్నారన్నారు. తాడేపల్లిలో కూడా నేరాలు పెరిగిపోయాయని, బాధితులు పోలీసుల దగ్గరకు పోతే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్.