సీట్ల కేటాయింపులో హెచ్చు తగ్గులకంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ(BJP), తెలుగుదేశం (TDP), జనసేన కలసి పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం సీట్ల కేటాయింపుపై ఆయా పార్టీల అధినేతలు భేటీ అయ్యారు.
సుధీర్ఘ చర్చల అనంతరం అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీకి సంబంధించి మూడు పార్టీలకు సీట్లను కేటాయించారు. తదనంతరం జనసేన అధినేత సీట్ల కేటాయింపుపై మంగళవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపకాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని తెలిపారు.
ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాదిపడిందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నట్లు జనసేనాని తెలిపారు. ఎన్డీఏ భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటామన్నారు. ‘‘చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ బైజయంత్ పాండా గారికి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు’’ అంటూ రాసుకొచ్చారు.
అదేవిధంగా ‘‘గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలసి పనిచేస్తాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి.’ అని పేర్కొన్నారు.