పెద్దపల్లి (Peddapally) జిల్లాలో నేడు భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకొంది. జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. జండా చౌరస్తా సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ (Short Circuit)తో మూడు దుకాణాలు కాలి బూడిదయ్యాయని తెలుస్తోంది. స్థానికుల ఇచ్చిన సమాచారం ప్రకారం..
మొదట వాచ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న పూజా సామాగ్రి దుకాణంతో పాటు పక్కనే ఉన్న మరో షాప్ లోకి వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకొన్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తేవడంతో షాపింగ్ కాంప్లెక్స్‌లోని మిగతా దుకాణాలకు మంటలు వ్యాపించకుండా నియంత్రించారు.
కాగా పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పినట్లు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ (CI) కృష్ణ, ఎస్సై (SI) లక్ష్మణ్ రావు తదితరులు పరిశీలించారు. ఇదిలా ఉండగా తరచుగా జరుగుతున్న అగ్నిప్రమాదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల వివిధ కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు..