నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ద్వేష భావాన్ని ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోడీ (PM Modi)అన్నారు. ఈ ఓటమిని చూసి ప్రతిపక్షాలు (Opposition ) నిరాశలోకి వెళ్లిపోవద్దన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఇదొక సువర్ణ అవకాశం అన్నారు. అందువల్ల ఎంపీలంతా సన్నద్దమై పార్లమెంట్ సమావేశాలకు రావాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మోడీ మాట్లాడారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. దేశంలోని సామాన్య ప్రజల సంక్షేమం, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కట్టుబడి ఉన్నవారికి ప్రోత్సాహం కలిగించేలా ఈ ఫలితాలు ఉన్నాయని వివరించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు.
ప్రతిపక్షాలు తమ వ్యతిరేక భావనను వీడి సానుకూలతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దయచేసి ఓటమి తాలుకు నైరాశ్యాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించవద్దని కోరారు. ప్రతిపక్షాలు సానుకూలతతో ముందుకు సాగాలని కోరారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తొమ్మిదేండ్ల ప్రతికూల ధోరణిని వదిలి పెట్టాలన్నారు. అలా చేస్తే వారిపై ప్రజలు తమ భావాన్ని మార్చుకుంటారని చెప్పారు.
ప్రతిపక్షాలు కేవలం తమ ప్రయోజనాల కోసమే సభలో నిరసనలు తెలపవద్దని సూచించారు. ఇది ప్రతిపక్షాల ప్రయోజనం కోసమే తాను చెబుతున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి విశిష్టమైన పాత్ర ఉందన్నారు. అందువల్ల ప్రతిపక్షాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని, ఆ ప్రయాణం ఆగకూడదని దేశం కోరుకుంటోందన్నారు. శీతాకాలం ఆలస్యమవుతోందని, కానీ దేశంలో మాత్రం పొలిటికల్ హీట్ పెరుగుతోందన్నారు.