Telugu News » Telangana : దళిత బంధు ఏది..? మిన్నంటిన నిరసనలు!

Telangana : దళిత బంధు ఏది..? మిన్నంటిన నిరసనలు!

రోజూ ఎక్కడో ఒక చోట దళిత బంధు కోసం దళితులు రోడ్డెక్కుతున్నారు. గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి వ్యాప్తంగా దళిత బంధు కోసం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

by admin
people-protest-for-dalit-bandhu

– దళిత బంధు పోరాటం
– గ్రామాల్లో జోరుగా ధర్నాలు
– బీఆర్ఎస్ వాళ్లకే ఇస్తున్నారని ఆగ్రహం
– అర్హులకు అందడం లేదని నిరసనలు
– సీఎం దిష్టిబొమ్మ దహనం

దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. హుజూరాబాద్ (Huzurabad) ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే తీసుకొచ్చామని బీఆర్ఎస్ (BRS) నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో పథకం అమలుపై గంపెడాశతో ఉన్నారు దళితులు. అయితే.. బీఆర్ఎస్ లీడర్లు తమకు అనుకూలమైన వారినే ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

people-protest-for-dalit-bandhu

రోజూ ఎక్కడో ఒక చోట దళిత బంధు కోసం దళితులు రోడ్డెక్కుతున్నారు. గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి వ్యాప్తంగా దళిత బంధు కోసం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన వారికి కాకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులకు, తమ అనుచరులకే వర్తించేలా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనలు చేస్తున్నారు దళితులు. అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కదావన్ పూర్, నర్సయ్యగూడ గ్రామాల దళితులు రోడెక్కారు.

పరిగి-షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించిన దళితులు రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆందోళనకారుల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, దళితులకు మధ్య తోపులాట జరిగింది.

మెదక్​ (Medak) జిల్లాలో కూడా లబ్ధిదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరికే పథకాన్ని ఇస్తున్నారంటూ దళితులు నిరసన తెలుపుతున్నారు. గ్రామాల్లో అర్హులందరికీ ఇవ్వాలని.. లేకుంటే మొత్తానికే రద్దు చేయాలంటూ పలు గ్రామాల్లో తీర్మానాలు కూడా చేస్తున్నారు. అల్లాదుర్గం మండలం ముప్పారం, వెంకట్రావుపేట్ గ్రామస్తులు ఎంపీడీవోకు వినతి పత్రం అందజేయగా, మాందాపూర్ గ్రామంలో కొందరికే మంజూరు చేస్తే దళిత బంధు వద్దంటూ దళితులు ర్యాలీ నిర్వహించి, స్థానిక ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. గ్రామంలో 120 దళిత కుటుంబాలు ఉండగా కేవలం 8 మందికి మాత్రమే ఈ స్కీమ్ మంజూరు కావడంపై వారు నిరసన తెలిపారు.

చేవెళ్ల గ్రామ దళితులు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేశారు. 120 కుటుంబాలు ఉంటే నలుగురికే దళిత బంధు ప్రకటించడం సరికాదన్నారు. దళిత బంధును బీఆర్ఎస్ లీడర్లకే ఇస్తున్నారని ఆరోపిస్తూ రేగోడ్ మండల పరిధిలోని తిమ్మాపూర్ లో వార్డు మెంబర్లు, దళితులు ఆందోళనకు చేశారు. వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన సభలో ఎస్సీలు, బుడగ జంగాల మధ్య కొట్లాట జరిగింది. అసలైన దళితులకు కాకుండా వలస వచ్చిన బుడగ జంగాలకు పథకం ఎలా అమలు చేస్తారంటూ ఎస్సీలు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. మాటామాటా పెరిగి ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి.

ఆదిలాబాద్ (Adilabad) జిల్లా లోకేశ్వరం మండలంలో దళిత బంధు లొల్లి జరిగింది. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన వందలాదిమంది దళితులు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపికలో పేదవారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆర్థికంగా బలంగా ఉన్నవారిని ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పలువురు నాయకులను వారు నిలదీశారు. ఇవే కాదు.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా దళిత బంధు కోసం రోడ్డెక్కుతున్నారు దళితులు. పథకం అమలులో అక్రమాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. అనర్హులకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

You may also like

Leave a Comment