Telugu News » Telangana : తిరగబడుతున్న తెలంగాణ.. ఎమ్మెల్యేలకు నిరసన సెగలు

Telangana : తిరగబడుతున్న తెలంగాణ.. ఎమ్మెల్యేలకు నిరసన సెగలు

సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్శించెర్ల సబ్ స్టేషన్ దగ్గర ఎమ్మెల్యే సైదిరెడ్డికి నిరసన సెగ తగిలింది. ఓ కార్యక్రమం నుంచి తిరిగి వెళ్తున్న ఆయన్ను.. రైతులు అడ్డుకున్నారు.

by admin
People questioning to BRS MLAs
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాకులు
  • కరెంట్ విషయంలో సైదిరెడ్డిని ప్రశ్నించిన జనం
  • చల్లా ధర్మారెడ్డి, ఆరూరు రమేష్ దీ ఇదే పరిస్థితి
  • అడుగడుగునా నిలదీతలు

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలకు వరుసగా షాకిస్తున్నారు ప్రజలు. ఎక్కడ కనిపించినా ఇచ్చిన హామీలు, చేసిన అభివృద్ధిపై నిలదీస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజకవర్గాలకే పరిమితమైన నేతలు.. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఏదో ఒక కార్యక్రమంతో జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు.

People questioning to BRS MLAs

సూర్యాపేట (Suryapet) జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్శించెర్ల సబ్ స్టేషన్ దగ్గర ఎమ్మెల్యే సైదిరెడ్డి (Saidureddy) కి నిరసన సెగ తగిలింది. ఓ కార్యక్రమం నుంచి తిరిగి వెళ్తున్న ఆయన్ను.. రైతులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో కరెంట్ సమస్యలు ఉన్నాయని.. విద్యుత్ సరిపోక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఓ రైతు మూడు గంటలు కూడా కరెంట్ రావడం లేదని అనడంతో.. అతడిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న మేలు దేశంలో ఎక్కడా జరగడం లేదని సర్దిచెప్పారు.

విద్యుత్ అధికారులతో ఫోన్ ​లో మాట్లాడారు సైదిరెడ్డి. రైతుబీమా, రైతు బంధు లాంటి పథకాలు అమలు చేసిన ప్రభుత్వం కేసీఆర్​ ది అని.. కాంగ్రెస్ మాటలు విని ఇలా ధర్నాలకు దిగడం సరికాదని హితవు పలికారు. ‘‘ఏమైనా సమస్య ఉంటే నా దగ్గరకి తీసుకురండి.. నేను పని చేయకుంటే అప్పుడు నన్ను అడగండి, అంతేగాని రోడ్డు మీద ధర్నా చేయడం సరికాదు’’ అని రైతులకు చెప్పి వెళ్లిపోయారు ఎమ్మెల్యే.

ఇక, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Dharmareddy), వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్ (Aruri Ramesh) కు కూడా అడుగడుగునా నిలదీతలు ఎదురవుతున్నాయి. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం వెళ్తుండగా గ్రామాల్లోని ప్రజలు వీరిని నిలదీస్తున్నారు. నడికూడ మండలం వరికోల్ లో నీకు ఓటు ఎందుకు వేయాలంటూ చల్లాను నిలదీశారు గ్రామస్తులు. అలాగే, కౌకొండ గ్రామంలోనూ ఎమ్మెల్యే బైక్ ర్యాలీని అడ్డుకొని అభివృద్ధి పనులపై ప్రశ్నించారు మహిళలు.

వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో అరూరి రమేష్ ను ప్రశ్నించారు గ్రామస్తులు. పేద దళితులకు ఇస్తానన్న భూమి, దళిత బంధు ఏదంటూ నిలదీశారు. ఇలా ఎక్కడ కనిపించినా ప్రజలు నిలదీస్తుండడంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారు. పోలీసుల సహాయంతో ఆందోళనకారులను అడ్డుకుని.. సైలెంట్ గా వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యేల తీరుపై ఆయా నియోజకవర్గాల ప్రజలు మండిపడుతున్నారు.

You may also like

Leave a Comment