ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్(PM Albanese) ఎలాన్ మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిడ్నీలో ఇటీవల చర్చి బిషప్‌పై జరిగిన కత్తిదాడికి సంబంధించిన పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమం ఎక్స్ (X)ను అక్కడి ఫెడరల్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆస్ట్రేలియాలో పోస్టులను నిలిపివేసిన ట్విట్టర్, ప్రపంచవ్యాప్తంగా కొనసాగించింది. ఈ క్రమంలో ప్రధాని ఆల్బనీస్ ట్విట్టర్(x) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎలాన్ మస్క్ తన ప్లాట్‌ఫామ్‌పై హింసాత్మక కంటెంట్‌ను ఉంచేందుకు పోరాడటం విడ్డూరంగా ఉందన్నారు ప్రధాని ఆల్బనీస్. ఈ క్రమంలో మస్క్‌ను ఆయన ‘పొగరుబోతు బిలియనీర్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తాను చట్టానికి అతీతుడిగా మస్క్ భావిస్తున్నారని మండిపడ్డారు. ఆస్ట్రేలియా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కంటెంట్‌ను ఉంచేందుకు పోరాడటం వింతగా ఉందని పేర్కొన్నారు.
అయితే, దాడికి సంబంధించిన పోస్టులపై నిషేధం విధించేందుకు అనుమతించాలంటూ ఆస్ట్రేలియా సైబర్ నియంత్రణ సంస్థ ఈ- సేఫ్టీ కమిషనర్ చేసుకున్న విజ్ఞప్తిని సోమవారం ఫెడరల్ కోర్టు అంగీకరించింది. రెండురోజుల పాటు ఆ సంఘటనకు సంబంధించిన కంటెంట్‌ను నిలిపివేయాలని ఎక్స్ (X)ను ఆదేశించింది. ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఉండటం, వాటిపై వివిధ వర్గాల నుంచి కామెంట్లు రావటంతో వాటిని బుధవారం మధ్యాహ్నం వరకు కనిపించకుండా చేయాలని సూచించింది.
మరోవైపు ఆల్బనీస్ స్పందించడం కంటే ముందే కోర్టు ఆదేశాలపై మస్క్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ఈ-సేఫ్టీ కమిషనర్‌ను ఆ దేశ సెన్సార్‌షిప్ కమిషనర్ అంటూ ఎద్దేవా చేశారు. హింసాత్మక కంటెంట్‌ను తొలగించకపోవడం సమంజసం కాదంటూ ఆల్బనీస్ చేసిన వ్యాఖ్యలపై మస్క్ స్పందించారు. ‘ఎక్స్’ను నిజమైన వాక్ స్వాతంత్ర్యానికి వేదికగా ప్రధాని పరోక్షంగా అంగీకరించారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఘటనకు స్పందించిన కంటెంట్‌ను సోషల్ మీడియా సంస్థ.. ఆస్ట్రేలియాలోని యూజర్లకు మాత్రమే కనిపించకుండా నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా కంటెంట్‌ను నియంత్రించాలని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని (X) తేల్చి చెప్పింది. అయితే, ఆ దేశం వెలుపల ఉండే యూజర్లకు మాత్రం అవి ఇంకా కనిపిస్తున్నట్లు సమాచారం. కాగా, ‘ఎక్స్’ తీరుపై ఆల్బనీస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాకు సామాజిక బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.