భారత్- మాల్దీవుల వివాదంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. ప్రతి విషయాన్ని ప్రధాని మోడీ వ్యక్తిగతంగా తీసుకుంటారని అన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో మన పొరుగు దేశాల సత్సంబంధాలను కొనసాగించాలని ఖర్గే పేర్కొన్నారు. సమయాన్ని బట్టి మనం వ్యవహరించాలని సూచించారు. మనం మన పొరుగువారిని మార్చుకోలేమని వెల్లడించారు. మరోవైపు భారత్-మాల్దీవుల వివాదంలో ప్రధాని మోడీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మద్దతుగా నిలిచారు.
భారత ప్రధానికి వ్యతిరేకంగా మరో దేశం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దాన్ని దేశం అంగీకరించిబోదని తెలిపారు. నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని అని అన్నారు. మన ప్రధానిపై ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.
దేశ ప్రజలుగా ప్రధాని పీఠాన్ని ఖచ్చితంగా గౌరవించాలన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా ఇతర దేశాలు చేసే వ్యాఖ్యలను తాము ఖండిస్తామని వెల్లడించారు. ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం పదవుల నుంచి తొలగించింది.