కాంగ్రెస్ ( Congress) , దాని గమాండియా కూటమి కలిసి మన సంస్కృతిని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నాయని ప్రధాని మోడీ (PM Modi) విరుచుకుపడ్డారు. అభివృద్ధి కోసం దేశం ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం దేశాన్ని వెనక్కి తీసుకు వెళ్లాలని చూస్తోందని మండిపడ్డారు. గతంలో డిజిటల్ ఇండియా ( Digital India) ను కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. కానీ ఇప్పడు మన యూపీఐని చూసి ఇండియా ఆశ్చర్యపోతోందన్నారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ జంబోరీ మైదానంలో నిర్వహించిన ‘కార్యకర్తల మహా కుంభ్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బిమారు (పేద రాష్ట్రం)గా మారుస్తుందన్నారు. దేశంలో ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి కాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసిందని తీవ్రంగా మండిపడ్డారు.
ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే కాంగ్రెస్ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లంతా సంపన్నుల కుటుంబాల్లో పుట్టిన వాళ్లేనన్నారు. వాళ్లకు పేదవాళ్ల జీవితాలు ఒక పిక్నిక్ లాంటిదన్నారు. పేద, వెనుకబడిన, అణగారిన, బీసీ,ఎస్టీ, ఓబీసీలకు అభివృద్ధి ఫలాలు అందేలా బీజేపీ చేసిందన్నారు. కాంగ్రెస్ తన ప్రయోజనాల కోసం ప్రజలను పేదరికంలో మగ్గిపోయేలా చేశారన్నారు.
గడిచిన ఐదేండ్లలో బీజేపీ పాలనలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. నారీ శక్తి వందన్ అదినీయమ్ దేశంలో కొత్త చరిత్రను సృష్టించిందన్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా, మధ్య ప్రదేశ్ ను అభివృద్ధి చేసే సమయమని పేర్కొన్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో కాంగ్రెస్ లాంటి కుటుంబ పార్టీలకు అవకాశం ఇస్తే రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ తుప్పు పట్టిన ఇనుము లాంటిదన్నారు. వర్షం పడితే పూర్తిగా నాశనం అవుతుందని ఎద్దేవా చేశారు.