వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20వ వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ (PM Modi) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అహ్మదాబాద్ లోని సైన్స్ సిటీని (Science City) ప్రధాని మోడీ సందర్శించారు. ఈ సందర్బంగా ప్రధానికి రోబో (Robo) లు ఘన స్వాగతం పలికాయి. అనంతరం సైన్స్ సిటీలోని పలు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను ప్రధాని మోడీ పరిశీలించారు.
రోబోటిక్ ఎగ్జ్ బిషన్ ను తిలకించిన మోడీ అక్కడ గ్యాలరీలో వున్న డీఆర్డీఓ రోబోలు, మైక్రోబాట్ల గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో ఉపయోగించే రోబోల గురించి అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్బంగా గ్యాలరీలోని ఓ కేఫ్ ను సందర్శించారు. ఆ సమయంలో అక్కడి రోబోలు ఆయనకు టీని అందించాయి.
కేఫ్ లో ప్రధాని మోడీ ఓ టేబుల్ పై కూర్చోగా రోబో ఒకటి వచ్చి ప్రధానికి బిస్కెట్లు అందించం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా వుంటే రాష్ట్రంలోని చోటా ఉదయ్ పూర్ లో రూ. 5206 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించారు. దీంతో పాటు 22 జిల్లాల్లో వైఫై సౌకర్యాలను ప్రారంభించారు.
అనంతరం వైబ్రంట్ గుజరాత్ సదస్సులో ప్రధాని మాట్లాడారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు. త్వరలోనే ప్రపంచ మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందన్నారు. భారత్‌ను ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గా మార్చడమే తన లక్ష్యమన్నారు. 20 ఏండ్ల క్రితం వైబ్రంట్ గుజరాత్ అనే ఒక చిన్న విత్తనాన్ని నాటామని చెప్పారు. ఇప్పుడు అది మహా వృక్షంగా మారిందన్నారు.