ప్రధాని మోడీ(PM Modi)తో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్(Bill gates) ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. ఈ నెల మొదటి వారంలో భారత పర్యటనకు వచ్చిన బిల్‌గేట్స్ ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సవాళ్లపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్తో పాటు వాతావరణంలో మార్పులు లాంటి అనేక అంశాలపై వీరు ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
భారత్‌లో టెక్నాలజీ వినియోగం తీరుతెన్నులను ప్రధాని మోడీ బిల్‌గేట్స్‌కు వివరించారు. అదేవిధంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిమించడానికి టెక్నాలజీని వాడాలని తాను భావించానని మోడీ తెలిపారు. జీ-20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వాడుకున్నామని చెప్పిన ప్రధాని ‘నమో యాప్’ను ఎలా ఉపయోగించుకోవావే గేట్స్‌కు వివరించారు. చాట్ జీపీటీ వినియోగం మంచిదేనని తెలిపిన మోదీ, ఇది అలసత్వానికి దారి తీయకూడదని సూచించారు.
ఇది ఎంతో శక్తిమంతమైంది అయినా.. పలువురి చేతుల్లో దుర్వినియోగమవుతోందన్నారు. డీప్ ఫేక్ ద్వారా తన గొంతును కూడా అనుకరించినట్లు మోడీ చెప్పారు. విద్యారంగంలో మార్పులకు టెక్నాలజీ ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. జీ 20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించినట్లు వివరించారు. ప్రైవసీని దెబ్బతీయకుండా డేటా వినియోగం జరగాలన్నారు. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి కూడా బిల్‌గేట్స్‌కు మోడీ వివరించారు.
ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మాట్లాడుతూ డిజిటల్ రంగంలో భారత్ తీసుకొచ్చిన మార్పులను ప్రశంసనీయమన్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ ప్రారంభమై 25ఏళ్లు గడిచిందని వెల్లడించారు. టెక్నాలజీని భారతీయుల చాలా వేగంగా ఆపాదించుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. సాంకేతిక రంగంలో భారత్ దూసుకుపోతున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. ప్రజల చేత, ప్రజల కోసం టెక్నాలజీని అందిస్తున్నాం.. అయితే, జీ-20 సదస్సు సమగ్ర స్థాయిలో జరిగింది. ఇండియా ఆ సదస్సును అద్భుతంగా నిర్వహించిందని చెప్పారు.