కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) ఒకే నాణేనికి రెండు ముఖాలు అని ప్రధాని మోడీ (PM Modi) ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే బీఆర్ఎస్కు ఓటు వేయడమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్తారని తెలిపారు. కానీ బీజేపీ అలా కాదన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని మోడీ స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుక్కుగూడలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ…. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీల ప్రజలు పూర్తిగా తిప్పికొట్టారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు.
ఇక్కడి ప్రజల్లో తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ అవినీతి వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రావటం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండు స్వార్థ పార్టీలని విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు సమాజ విరోధులని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తే పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల కోట్లు జమ చేశామన్నారు. రైతులకు రూ.300లకే యూరియా బస్తా ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్ రైస్ కొంటున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్కు కార్బన్ సర్కార్లా పని చేస్తుందన్నారు
మోడీని తిట్టడమంటే కేసీఆర్‌కు మహా ఇష్టమని వెల్లడించారు. ఇరిగేషన్ స్కీమ్‌లను కేసీఆర్ ఇరిగేషన్ స్కామ్‌లు చేశారని నిప్పునలు చెరిగారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని స్పష్టం చేశారు. మాదిగల వర్గీకరణకు కొత్తగా కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు లాభం చేకూరుతుందన్నారు.