పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని.. మాట తప్పిన ప్రధాని మోడీ (PM Modi) కి మహబూబ్ నగర్ (Mahabubnagar) లో పర్యటించే అర్హత లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud). జాతీయ హోదా హామీ ఇచ్చి నెరవేర్చని ప్రధాని.. మళ్లీ అదే వేదికపై ఏం మాట్లాడేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే విషం చిమ్మేవాళ్లు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలన్నారు.
రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తే పాలమూరుకు జాతీయ హోదా ఇస్తామని చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించే ప్రసక్తే లేదని.. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘‘మేం ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూనే ఉంటాం, మీరు మోసపోతూనే ఉండండి’’ అనేలా కేంద్రం తీరు ఉందని ఎద్దేవ చేశారు. సమైక్య రాష్ట్రంలో పెండింగులో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తి చేసి సాగు, తాగు నీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. కానీ ప్రజల సమక్షంలో జాతీయ హోదా హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర బీజేపీదని విమర్శించారు.
కర్ణాటక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన బీజేపీ సర్కార్.. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు శ్రీనివాస్. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా తేల్చకుండా నాన్చుతున్నారని.. హైదరాబాద్ కు దీటుగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మోడీ పాలమూరు అభివృద్ధి చూసిపోవాలని సూచించారు. తెలంగాణను అవమానించిన ఆయనకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించారు.
అడ్డదారుల్లో రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ చూస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు శ్రీనివాస్ గౌడ్. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను బీజేపీ నాశనం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు అవుతున్న ఒక్క పథకమన్నా ఉందా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను మెచ్చుకుంటారని.. బయటకు వచ్చి కేసీఆర్ ను తిడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీనివాస్ గౌడ్.