పార్లమెంట్‌లో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Niramla Sitaraman) ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోడీ (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. బడ్జెట్ 2024-25 ఆశాజనకంగా ఉందని మోడీ వెల్లడించారు. ఈ బడ్జెట్ సమగ్రమైన, వినూత్నమైనదని పేర్కొన్నారు.
యువ భారత ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉందని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర బడ్జెట్ చాలా మెరుగ్గా ఉందని వెల్లడించారు.ఈ బడ్జెట్ ఎన్నో ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుందని చెప్పారు. ఇది వృద్ధి ఆధారిత బడ్జెట్ అని వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని బడ్జెట్ హామీ ఇస్తోందన్నారు.
బడ్జెట్‌లో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని ప్రకటించారని చెప్పారు. ఈ బడ్జెట్ సంఘటితమైనదని, వినూత్నమైనదని వ్యాఖ్యానించారు. ఇది యువ, గరీబ్, మహిళ, కిసాన్, వికసిత్ భారత్ 4 స్తంభాలను శక్తివంతం చేస్తుందని చెప్పుకొచ్చారు.
ఆదాయపు పన్ను మినహాయింపు పథకం ఒక కోటి మందికి పైగా ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఈ బడ్జెట్‌లో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. పేద, మధ్యతరగతి వర్గాల సాధికారత, వారికి అవకాశాలను కల్పించాల్సిన అవసరాలను ఈ బడ్జెట్ నొక్కి చెప్పిందన్నారు. పేదలకు మరో 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనం అందిస్తామన్నారు.