విజయ్ దివస్ (Vijay DiWas) సందర్బంగా 1971లో పాక్ (Pak) పై యుద్దంలో అమరులైన భారత జవాన్లకు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోడీ (PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్ష సహాయ మంత్రి అజయ్ భట్ అమర వీరులకు అంజలి ఘటించారు. వారితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దరామయ్యలు కూడా నివాళులు అర్పించారు.
అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి చారిత్రకమైన విజయాన్ని అందించిన అమర జవాన్లకు విజయ్ దివస్ సందర్బంగా నివాళులు అర్పిస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. 1971 యుద్దంలో మన సైనిక దళాలు చేసిన నిస్వార్థమైన త్యాగాన్ని ఈ దేశం స్మరించుకుంటుందని వెల్లడించారు.
విజయ్ దివస్ సందర్బంగా 1971లో పాక్ పై భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. వారి పరాక్రమం, అంకిత భావం దేశానికి గొప్ప గర్వకారణంగా మిగిలి పోయిందని తెలిపారు. వారి త్యాగాలు, వారి చూపిన అచంచలమైన స్పూర్తి ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచి పోతుందని ట్వీట్ చేశారు.
1971 తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)లో పాక్ సైన్యం అక్కడి బెంగాలీలను ముఖ్యంగా హిందూ మైనార్టీ వర్గాలను ఊచ కోత కోసింది. ఈ మారణ హోమంలో లక్షలాది మంది మరణించారు. కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో పాక్ కు వ్యతిరేకంగా వ్యవహరించాలని అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయించారు.
ఈ క్రమంలో 1971 డిసెంబర్ 3న భారత్ లోని 11 ఎయిర్ బేస్ లపై పాక్ దాడులు చేసింది. దీంతో పాక్ పై పూర్తి స్థాయిలో విరుచుకు పడాలని భారత ఆర్మీ చీఫ్ శామ్ మానెక్ షాను ఇందిరా గాంధీ ఆదేశించారు. దీంతో భారత దళాలు రంగంలోకి దిగాయి. బంగ్లాదేశీ జాతీయ వాద గ్రూపులతో కలిసి ఇండియన్ నేవి ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది. వెంటనే కరాచీ పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుంది.
కేవలం 13 రోజుల్లోనే పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ తన సైన్యంతో కలిసి భారత సైన్యం ముందు లొంగిపోయారు. ఈ మేరకు పత్రాలపై సంతకం చేశారు. ఈ పరిమాణాలతో కొత్త దేశం బంగ్లాదేశ్ ఆవిర్బవించింది. ఈ యుద్దంలో సుమారు 3000 మంది భారత సైనికులు అమరులయ్యారు. అమర జవాన్ల ధైర్య, సాహసాలను స్మరించుకుంటు డిసెంబర్ 16ను విజయ్ దివస్ గా జరుపుకుంటున్నారు.