దేశ వ్యాప్తంగా గృహాల్లో సౌరశక్తి (Solar Energy) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తోంది. ఈ మేరకు ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనా (PM Suryoday Yojana) కింద ఇచ్చే సబ్సిడీని పెంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రూఫ్ టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ చేసుకునే వాళ్లకు ఈ పథకం కింద 40శాతం సబ్సిడీగా ఇస్తోంది.
తాజాగా దీన్ని 60శాతానికి పెంచేందుకు రెడీ అయినట్టు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. దేశంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరిగి పోతోంది. ఈ క్రమంలో దేశంలో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా పునరుత్పాదక వనరైన సౌరశక్తిని ద్వారా విద్యుత్ ను తయారు చేసుకునేందుకు వీలుగా సోలార్ సిస్టమ్ ను కేంద్రం అందిస్తోంది.
ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటే దాని కోసం చాలా వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రజలకు సహాయంగా ఉండేలా ఈ పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది. సోలార్ సిస్టమ్ కొనుగోలు కోసం రుణాలు తీసుకోవడం పేదలకు పెద్ద సమస్యగా ఉంటుందని చెప్పారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని సబ్సిడీ పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న సబ్సిడీని 40 నుంచి 60శాతానికి పెంచుతామని చెప్పారు. మిగిలిన 40 శాతాన్ని రుణం కింద లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ పథకాన్ని ప్రతి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(CPSE) ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్స్(SPV) ద్వారా ఈ పథకం అమలు చేయనున్నారు. రుణాల చెల్లింపు కాల పరిమితి 10 ఏండ్లు ఉంటుందన్నారు.