ప్రధాని మోడీ (PM Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ (శుక్రవారం) ఉదయం ప్రత్యేక విమానంలో భూటాన్(Bhutan)కు వెళ్లారు. వాస్తవానికి గురువారం వెళ్లాల్సి ఉండగా అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది. తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో మోడీ భూటాన్ బయల్దేరారు.
ఈనెల ప్రారంభంలో భూటాన్ ప్రధాని ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. జనవరిలో అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత ఆయనకదే తొలి విదేశీ పర్యటన. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాని మోడీని కలిసి పలు విషయాలపై ప్రధానంగా చర్చించారు.
కాగా, ఇవాళ భూటాన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ నేడు, రేపు భూటాన్‌లో ద్వైపాక్షిక అంశాలు, ఇరుదేశాల పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించనున్నారు. భారత్-భూటాన్ మధ్య సాధారణ ఉన్నత స్థాయి సంబంధాలు మెరుగుపర్చడంతో పాటు ‘నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ’లో భాగంగా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మోడీ భూటాన్ రాజుతో చర్చించనున్నారు.
తన పర్యటన సందర్భంగా భూటాన్ రాజు హిస్ మెజెస్టి జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్ చుక్, భూటాన్ నాల్గవ రాజు హిస్ మెజెస్టి జిగ్మే సింగ్మే వాంగ్యే వాంగ్ చుక్లతో మోడీ భేటీ కానున్నారు. అదేవిధంగా భూటాన్ కౌంటర్ షెరింగ్ టోబ్గేతో కూడా ఆయన చర్చలు జరపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను కూడా మోడీ ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రిని భూటాన్ భారత్ సాయంతోనే నిర్మించింది.