పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పై విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్న ప్రధాని మోడీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) సైతం వదలడం లేదు.. తాజాగా ఆయన ఓటుకు నోటు కేసుపై కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద స్కామ్ చేసిందని ఆరోపించారు.. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణ (Telangana)లో పర్యటిస్తోన్న మోడీ.. సంగారెడ్డి జిల్లాలోని అల్లాదుర్గం వద్ద ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆరోపణలు చేశారు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసును గత ప్రభుత్వం తొక్కి పెట్టిందని.. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కి సహాయంగా.. కాళేశ్వరం స్కామ్‌ను తొక్కి పెడుతోందని మండిపడ్డారు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనన్న విషయం ఇక్కడే అర్థం అవుతోందని పేర్కొన్నారు.. అవినీతిలో ఈ పార్టీలు భాగస్వాములే అన్నారు.. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేతలతో పాటు.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష నేతలున్నారని ఆరోపించిన మోడీ (Modi).. ఎన్నో అబద్ధాలు ఆడి అధికారం చేజిక్కించుకొందని ధ్వజమెత్తారు.. పదేళ్ల ఎన్డీఏ చేసిన అభివృద్ధిని మీరంతా చూశారని ప్రజలను ఉద్దేశించి అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) మళ్లీ పాత రోజుల్ని తీసుకురావాలని కుట్ర చేస్తోన్నట్లు ఆరోపించారు. ఈ పార్టీ చేతిలో దేశం అవినీతిమయైందని విమర్శలు గుప్పించారు. ఒకవైపు ప్రపంచం పురోగమిస్తుంటే.. దేశాన్ని అవినీతి ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్ ను నమ్మద్దని సూచించారు.. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల వేళ ఓటుకు నోటు కేసుపై మోడీ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారిందని అంటున్నారు..