– విపక్షాల హోదా మారదు
– మూడో టర్మ్ లో అతిపెద్ద నిర్ణయాలుంటాయి
– వెయ్యేళ్లకు పునాది వేస్తాం
– ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం విపక్షాలకు లేదు
– కాంగ్రెస్ రద్దు సంస్కృతిలో కూరుకుపోయింది
– ఎంతకాలం విద్వేషాన్ని పెంచుకుంటారు
– హస్తం దుకాణం మూతపడే పరిస్థితికి వచ్చింది
– పదేళ్లలో మేం చేసిన అభివృద్ధి చేయాలంటే..
– కాంగ్రెస్ కు వందేళ్లు పడుతుంది
– భారతీయులను నెహ్రూ సోమరులుగా భావించారు
– ఇందిరా గాంధీ కూడా భిన్నంగా ఆలోచించలేదు
– ఈసారి 400 సీట్లు పక్కాగా గెలుస్తామన్న ప్రధాని మోడీ
– లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు
దేశంలో ఈరోజు ‘ప్రతిపక్ష పరిస్థితి’ కి కాంగ్రెస్ దే బాధ్యత అని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి లోక్ సభలో సోమవారం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. విపక్షాల చర్యలు చాలా విచిత్రంగా ఉన్నాయని తెలిపారు. సుదీర్ఘ కాలం విపక్షంలోనే ఉండాలని ఆ పార్టీలు భావిస్తున్నాయని చురకలు అంటించారు.
ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యాన్ని విపక్ష సభ్యులు కోల్పోయారని ఎద్దేవ చేశారు. దేశం సాధించిన ప్రగతిని రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో వినిపించారని చెప్పారు. కాంగ్రెస్ రద్దు సంస్కృతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించిన మోడీ.. తాము మేకిన్ ఇండియా అంటున్నామని, కాంగ్రెస్ రద్దు అంటోందని మండిపడ్డారు. అలాగే, తాము ఆత్మనిర్భర్ భారత్ అంటుంటే.. కాంగ్రెస్ రద్దు అంటోందన్నారు.
ఎంతకాలం ఇలా విద్వేషాన్ని పెంచుకుంటారని ప్రశ్నించారు. దేశం ఏదైనా సాధించడాన్ని కూడా రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అని నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ… ప్రతిసారీ అదే పాత ప్రాడెక్ట్ ను మళ్లీ మళ్లీ అమ్మేందుకు ప్రయత్నించి కాంగ్రెస్ దుకాణం మూతపడే పరిస్థితికి వచ్చిందని ఎద్దేవ చేశారు ప్రధాని మోడీ. ఈరోజు దేశంలో పనులు ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయో కాంగ్రెస్ ఊహించలేదని చెప్పారు.
పేదల కోసం 4 కోట్ల ఇళ్లు కట్టించామని తెలిపారు. అందులో 80 లక్షల పక్కా ఇళ్లు పట్టణ పేదల కోసం నిర్మించామని వివరించారు. కాంగ్రెస్ కు ఈ పనులను పూర్తి చేయాలంటే వందేళ్ల సమయం పట్టేదన్నారు. 100 తరాలు గడిచిపోయేవని చెప్పారు. మంచి ప్రతిపక్షంగా ఉండేందుకు కాంగ్రెస్ కు అవకాశం వచ్చిందని చెప్పారు ప్రధాని.
కానీ, ఆ పాత్రను పోషించడంలో కూడా ఘోరంగా విఫలమైందని అన్నారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భారతీయులు సోమరులని భావించారని ఆరోపించారు. అలాగే, ఇందిరా గాంధీ కూడా భిన్నంగా ఆలోచించలేదన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 స్థానాలు వస్తాయని వాటిలో బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోడీ.