కేంద్ర ప్రభుత్వం(Central Government) పేదలకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Naredra Modi) కీలక ప్రకటన చేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య ఘర్ యోజన’(PM Surya Ghar Yojana) పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
సౌరశక్తి, స్థిరమైన పురోగతిని ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీని ద్వారా కోటి మంది ఇళ్లలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కోటి ఇళ్లలో వెలుగులు నింపడమే ఈ పథకం లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టులో రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని ప్రధాని వెల్లడించారు.
అదేవిధంగా ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా సబ్సిడీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు. జాతీయ ఆన్‌లైన్ పోర్టల్‌కు అనుసంధానించడం ద్వారా మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజల ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని ప్రధాని చెప్పారు.
‘పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్‌ను ప్రోత్సహించాలి. ‘సోలార్ పవర్, స్థిరమైన పురోగతిని పెంచుకుందాం. https://pmsuryaghar.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి’ అని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.