టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై కేసు ఫైల్ అయింది. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లపైనా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో నాగర్ కర్నూల్ (Nagar kurnool) పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్దన్ పట్వారి ఈ ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రేవంత్ ఏమన్నారు..?
కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి కొంతమంది పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. వారందరి పేర్లు రెడ్ డైరీలో రాసిపెట్టుకుంటున్నాం. అధికారంలోకి రాగానే బట్టలూడదీసి.. మిత్తితో సహా చెల్లిస్తాం. అధికార పార్టీకి వత్తాసు పలికిన పోలీసులపై చర్యలు తీసుకుంటాం.
వెనక్కి తీసుకోకపోతే యుద్ధమే!
రేవంత్ వ్యాఖ్యలపై పోలీస్ శాఖ సీరియస్ గా ఉంది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు పోలీసులు. కానిస్టేబుల్ నుండి డీజీ స్థాయి వరకు రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు పోలీసుల బట్టలు విప్పుతాం అని అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఈ వ్యాఖ్యలను రేవంత్ వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని అంటున్నారు. అవసరమైతే రేవంత్ కు బందోబస్త్ ను సైతం చేయమని చెబుతున్నారు పోలీసులు.