ఐపీఎల్(IPL)లో ముంబై టీమ్‌కు సారధ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యపై(Hardik Pandya) విమర్శలు వెల్లువెత్తాయి. చెన్నై చేతిలో ఓటమితో అవి మరింత పెరిగాయి. అతడి కెప్టెన్సీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ పరిణామంపై ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి సమయంలో పాండ్యకు మద్దుతుగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యను దెప్పిపొడవం సరికాదని సూచించాడు. ఇలాంటి విమర్శలు, కామెంట్లు పాండ్య ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపిస్తాయని అనుకోవడం లేదన్నాడు. అతడు ప్రతి చిన్న విషయానికి కుంగిపోయే రకం కాదని, జట్టుపరంగా తాము అతడికి అండగా నిలుస్తామని ముంబై కోచ్ వెల్లడించారు. క్రికెట్లో వ్యక్తిగతంగా కంటే టీమ్‌గా రాణిస్తేనే విజయావకాశాలు మెరుగుపడతాయని తెలిపాడు.
అలా ఎవరు ఎంత కష్ట పడుతున్నారనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నానని చెప్పాడు. హార్దిక్ తన నైపుణ్యాలను పెంచుకొనేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడని, ఇప్పుడు అతడిపై వస్తున్న విమర్శలను చూసి విసిగిపోయానంటూ కీరన్ పొలార్డ్ అసహనం వ్యక్తం చేశాడు. వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు.
ఇప్పుడు ముంబై టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాండ్య మరికొన్ని వారాల్లో టీమిండియాకు ఆడతాడని ఆప్పుడు కూడా అందరూ ప్రోత్సహించాలని సూచించాడు. ఇకపోతే, ఇటీవల చెన్నైతో జరిగిన మ్యాచ్ ముంబై టీమ్ ఓటమికి అనేక కారణాలున్నాయి. రోహిత్‌శర్మ (Rohit Sharma) సెంచరీ సాధించినా మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. అంతకు ముందు బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేదని పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తడంతో ముంబై కోచ్ స్పందించాడు.