ఖమ్మం (Khammam) జిల్లా నేలకొండపల్లి మండల కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ (Congress) పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy) పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మీద తీవ్ర విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. నువ్వేదో బాగు చేసేస్తావన్న నమ్మకంతో నిన్ను ప్రజలు గెలిపించలేదన్నారు.
రాజకీయాలలో డబ్బు ప్రాధాన్యం కాదనీ, డబ్బుందని విర్రవీగితే ప్రజలు తగిన బుద్ధి చెప్పకమానరన్నారు. అధికారం, డబ్బూ ఉన్నాయి కదాని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ ని నిర్వీర్యం చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదని తెలిపారు. బెదిరించి తీసుకెళ్లిన కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి త్వరలోనే చేరుతారన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములూ ప్రతి పేదవాడి ఇంటిముందుకు చేరుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని స్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించారు.
మిగతా పార్టీల మాదిరిగా ముందుగా టికెట్లను ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదన్నారు. అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసినా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మంనందరిదీ అని పొంగులేటి పేర్కొన్నారు.