తెలంగాణలో చేనేత రంగం పరిస్థితి దారుణం తయారైంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం కరువు అవ్వడంతో ఆర్డర్లు లేక కార్మికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల కోసం ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించిన బిల్లులే సుమారు రూ.200 కోట్లకు పైగా పెండింగులో ఉన్నట్లు అధికారులు గతంలో వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమను ఆదుకుంటుందని నేతన్నలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth reddy) నేతన్నల కష్టాలు తీర్చేందుకు ఎటువంటి చర్యలను ప్రభుత్వం తరఫున తీసుకోబోతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు.
ఈ క్రమంలోనే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister ponnam prabakar) చేనేత కార్మికుల(Handlooms) పక్షాన ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు అందరం కలిసికట్టుగా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం మీడియాతో పొన్నం మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని కాపాడండి.. కాటన్ను ప్రోత్సహించండి అని పిలుపునిచ్చారు.
ఇకపై ప్రభుత్వ కార్యకలాపాలు, వేడుకలు, సభలు, సమావేశాలు, ఎవరినైనా గౌరవించేటప్పుడు కాటన్ టవల్స్ తో సత్కరించాలని పిలుపునిచ్చారు. ఇలా చేస్తే చేనేత రంగాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు. చేనేత వస్త్రాలను వినియోగించడం వలన కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. బొకేలు, పూలు తీసుకొచ్చే బదులు కాటన్ టవల్స్, పుస్తకాలు, పెన్నులు ఇవ్వాలని కోరారు. శాలువాలు కప్పడం వలన ఉపయోగం ఏమీ ఉండదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దీనిని ఆచరించాలని సూచించారు.