హిందువుల్లో భాగమైన బీసీలకు బీజేపీ(BJP) అన్యాయం చేసిందని.. బీసీలు హిందువులు కారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రశ్నించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామంటే బీజేపీకి సంఘ్ పరివార్‌కి రుచించడం లేదని మండిపడ్డారు. దేశ ప్రధాని హోదాలో సార్వభౌమత్వాన్ని భంగం చేసేలా మాట్లాడుతున్నారని తెలిపారు.
తాను ఎంపీగా వున్నప్పుడు టాప్ 10లో ఉన్న మరి బండి సంజయ్ స్థానం ఏంటి..? అని నిలదీశారు. తన తల్లి గురించి తన పుట్టుక గురించి మాట్లాడిన మూర్ఖుడు బండి సంజయ్ అంటూ మండిపడ్డారు. చదువు రాదు.. భాష రాదు.. కనీసం ఎదుటి వారిని గౌరవించడం రాదన్నారు. నెత్తిమీద అర్ధరూపాయి పెడితే అర్ధ అణాకి విలువ చేయని వాళ్ళను చేర్చుకుని చేరికలు అంటున్నావు సంజయ్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్టీ సూచన మేరకే వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారని అన్నారు. మొదటి దశ ఎన్నికల తర్వాత మోడీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. బీజేపీ పాలనలో హిందువులకు చేసిన పనులు ఏంటి..? అని ప్రశ్నించారు. పదేళ్లలో మోడీ చేసిన పనుల ఫొటోలు లేవు కానీ రాముడి ఫొటోలు పెట్టుకుని ఇంటింటా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అన్యాయం చేసిందా? అని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు.
రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని అన్నారు. మొదటిదశ ఎన్నికల తర్వాత బీజేపీ అభద్రతా భావంలో ఉన్నదని తమ ఇండియా కూటమి ఐపీఎల్ టీమ్ లాంటిదని, సింగిల్‌గా ఉండి మీరెలా ఐపీఎల్ అడతారని సెటైర్ వేశారు. కాంగ్రెస్ వస్తే ఇల్లు, బంగారం, సంపద దోచుకుంటారని మోడీ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. బండి సంజయ్ అవకతవకలకు పాల్పడితే అధ్యక్ష పదవిపోయిందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే సంజయ్ గీతా కార్మికులకు రూ.50వేలు, గుళ్లకు రూ.5లక్షలు ఎలా ఇస్తారని అన్నారు.