కేసీఆర్ (KCR) ఏలుబడిలో పిలవబడిన ప్రగతి భవన్ (Pragathi Bhavan).. రేవంత్ (Revanth) హయాంలో జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ (Praja Bhavan) గా మారింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే భవనం ముందున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించారు. ఆ తర్వాతి రోజే ప్రజా దర్బార్ (Praja darbar) కు శ్రీకారం చుట్టారు. ప్రజా భవన్ అనేది ఐదు భవనాల సమాహారం. సీఎం నివాసం, కార్యాలయం, మీటింగ్ హాల్ సహా పలు నిర్మాణాలు ఉన్నాయి.
కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా కొనసాగింది ప్రజా భవన్. అయితే.. ఇప్పుడిది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అఫీషియల్ రెసిడెన్స్ గా మారింది. ఈ భవనాన్ని డిప్యూటీ సీఎం నివాసం కోసం అప్పగిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. వెంటనే, ఈ భవనాన్ని ఆయన ప్రైవేట్ సెక్రటరీకి అప్పగించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇక నుంచి డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్ కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసంపై ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని ఒక బ్లాకును కేటాయించే అవకాశముంది.
ప్రజా భవన్ ను 2016లో నగరం నడిబొడ్డున బేగంపేటలో నిర్మించారు. ఆఫీసర్స్ కాలనీలో ఉన్న 10 ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు, 24 ప్యూన్ క్వార్టర్లను కూల్చివేసి నిర్మాణం చేశారు. తొమ్మిది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ సముదాయానికి 2016-2017 ఆర్థిక సంవత్సరంలో రూ.46 ఖర్చయింది. 2016 మార్చిలో ప్రారంభమైన ఈ భవన నిర్మాణం నవంబర్ 23న పూర్తైంది. పక్కా వాస్తు ప్రకారం కట్టిన ఈ భవనం నియోక్లాసికల్ – పల్లాడియన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. దేశంలోనే పేరొందిన వాస్తు శిల్పి హఫీజ్ ఆధ్వర్యంలో ఇది పూర్తైంది.