తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారుల బండారం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో భుజంగరావు, తిరుపతన్న అరెస్టయ్యారు. తాజాగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావుల పేర్లను పంజాగుట్ట పోలీసులు(Panjagutta Police) ఎఫ్ఐఆర్(FIR)లో చేర్చారు.
ఈ కేసులో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులే కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఇద్దరు చెప్తేనే ప్రణీత్‌రావు ట్యాపింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ప్రణీత్‌రావు ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు అందించారు.
అదేవిధంగా ప్రణీత్‌రావుకు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల నెంబర్లను ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌లు ఇచ్చారు. అప్పడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్‌రెడ్డిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఎస్ఐబీ మాజీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు ఆదేశించారు. అంతేకాదు.. రేవంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు, అతని మిత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారు.
మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రేవంత్‌రెడ్డికి సంబంధించి ప్రతీ సమాచారాన్ని ప్రభాకర్‌రావుకు చేరవేశారు. ప్రణీత్‌రావు ఫైల్స్ కేసు నమోదు కావడానికి ముందే ప్రభాకర్ రావు, రాధా కిషన్ అమెరికా పారిపోయారు. మరోవైపు, ఈ కేసులో అరెస్టయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది.