రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవల్లిక(Pravallika) సూసైడ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిగా భావిస్తున్న శివరాం రాథోడ్(Shivaram Rathod) బెయిల్ రద్దు చేయాలని చిక్కడపల్లి పోలీసులు(Chikkadapalli police) అప్పీల్ పిటిషన్ వేశారు. దీంతో మరోసారి ఈ కేసు విషయం వార్తల్లో నిలిచింది.
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్‌ను అక్టోబర్ 21న పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడికి వ్యతిరేకంగా సరైన సాక్షాధారాలు లేనందున కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిక్కడపల్లి పోలీసులు శివరాంకు బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె మనస్తాపంతో హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో నిరుద్యోగులు, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు.
ఎన్నికల వేళ ప్రవల్లిక ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు మాత్రం శివరాం రాథోడ్‌తో ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు తమ కుమారుడికి న్యాయం చేయాలని శివరామ్ రాథోడ్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.