ఒప్పుకోను పరాజయం.. కొత్తదారి నా ధ్యేయం.. కాలం తలరాతని చెరిపేస్తా.. సరికొత్త గీతాన్ని పాడేస్తా అంటూ భారత రాజకీయ ముఖచిత్రంలో చెరగని ముద్ర వేశారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihari Vajpayee). ప్రభుత్వం కోసం ప్రజలు కాదు.. ప్రజల కోసమే ప్రభుత్వం అని చాటి చెప్పిన ఆయన.. సమాజహితమే ఊపిరిగా.. దేశాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన సాగించారు. ప్రజా సమస్యలపై పోరాడారు.. విపక్ష నేతల ప్రశంసలు సైతం అందుకున్నారు.
నేడు వాజ్ పేయి ఐదో వర్ధంతి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఢిల్లీ (Delhi) లోని సదైవ్ అటల్ స్మారకం వద్దకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోడీ (PM Modi) పుష్పాంజలి ఘటించారు. అలాగే, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా ఇతర నేతలు నివాళి అర్పించారు. వాజ్ పేయితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సోషల్ మీడియాలో వాజ్ పేయి నాయకత్వం గురించి ప్రత్యేకంగా వివరించారు ప్రధాని మోడీ. ఆయన పాలనలో దేశం చాలా లబ్ధి పొందినట్లు తెలిపారు. దేశ ప్రగతిలో క్రియాశీల పాత్ర పోషించారని వివరించారు. అనేక రంగాలను వాజ్ పేయి 21వ శతాబ్ధం వైపు తీసుకువెళ్లినట్లు చెప్పారు మోడీ.
వాజ్ పేయి 2018 ఆగస్టు 16న మరణించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 23 రోజులు జైలు జీవితం గడిపారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆర్ఎస్ఎస్ తో వాజ్ పేయిది 8 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం. 1968లో జనసంఘ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఆవిర్భవించిన తర్వాత మొదటి అధ్యక్షుడు అయ్యారు. మూడుసార్లు ప్రధానిగా దేశానికి సేవలందించారు. మొదటిసారి 13 రోజులకు, రెండోసారి 13 నెలలకు ఆయన ప్రధాని పదవిని కోల్పోయినా, మూడోసారి పూర్తికాలం కొనసాగి మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా గుర్తింపు పొందారు.
అమెరికా వంటి అగ్రదేశాలను ఎదిరించి మరీ పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపి భారతదేశ సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన ధైర్యశీలి వాజ్ పేయి. కార్గిల్ యుద్ధం ద్వారా పాకిస్తాన్ కు ధీటుగా స్పందించి బుద్ధి చెప్పారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు శత్రువులు ఉండరని ఆయన తరచూ చెబుతుండేవారు. తన చివరి వరకు ఇదే ఫాలో అయ్యారు. విపక్ష నేతల ప్రశంసలు సైతం అందుకున్నారు. వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను బీజేపీ శ్రేణులు, ప్రజలు, ఇతరులు మరోసారి గుర్తు చేసుకున్నారు.