ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిర్ (Swarved Mahamandir)ను వారణాసిలో ప్రధాని మోడీ (PM Modi)సోమవారం ప్రారంభించారు. సుమారు 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసే సౌకర్యం ఈ యోగా సెంటర్ లో ఉంది. ప్రారంభోత్సవం తర్వాత యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తో కలిసి యోగా సెంటర్ ను ప్రధాని మోడీ సందర్శించారు.
ఏడంతస్తుల భవనంలో దీన్ని నిర్మించారు. మహామందిర్ గోడలపై స్వర్వేద శ్లోకాలు చెక్కబడ్డాయి. ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా విహంగం యోగా శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఇది రెండవ సారి. అంతకు ముందు డిసెంబర్ 2021లో ఆయన మొదటి సారిగా పాల్గొన్నారు.
19వ శతాబ్దపు ఆధ్యాత్మిక వేత్త, కవి, జ్ఞాని సద్గురు సదాఫల్ డియోజీ మహారాజ్ విహంగం యోగ్ సంస్థాన్ ను స్థాపించారు. యోగా సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. ఇప్పుడు వారణాసి అంటే అభివృద్ధి, వారణాసి అంటే పరిశుభ్రత, మార్పు, విశ్వాసంతో పాటు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటయ్యాయి.
సాధువుల మార్గదర్శకత్వంలో, కాశీ ప్రజలు అభివృద్ధి, నవ నిర్మాణ పరంగా కొత్త రికార్డులు సృష్టించారని వెల్లడించారు. నేడు స్వర్వేద్ మహామందిర్ దీనికి చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు. తాను స్వర్వేద్ మహామందిర్లో పర్యటించినప్పుడు మంత్ర ముగ్దులయ్యానని చెప్పారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, గీత, మహాభారతాల దైవిక బోధనలు స్వర్వేద్ మహామందిర్ గోడలపై చిత్రాల ద్వారా చిత్రీకరించబడ్డాయని అన్నారు.