గుజరాత్లో జరుగుతున్న వైబ్రంబ్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనేందుకు మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో నుయిషీ (H.E. Filipe Jacinto Nyusi)ఈ రోజు గుజరాత్ చేరుకున్నారు. గాంధీనగర్లో నుయిషీతో ప్రధాని నరేంద్ర మోడీ ( PM Narendra Modi) భేటీ అయ్యారు.
మొజాంబిక్ అభివృద్ధి ప్రాధాన్యతలకు భారత్ మద్దతు ఇస్తుందని మోడీ వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు నడిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలతో పాటు రక్షణ, ఉగ్రవాదంపై పోరు, ఇంధన శక్తి, ఆరోగ్యం, వాణిజ్యం పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు, నీటి భద్రత, సముద్రంపై సహకారం వంటి అంశాలపై చర్చించినట్టు తెలిపాయి.
ఐక్యరాజ్యసమితి సహా బహుపాక్షిక వేదికల్లో సహకారానికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారని చెప్పాయి. వ్యాపారం, సంస్కృతికి, ప్రజా సంబంధాలను మెరుగు పరిచేలా ఎయిర్ కనెక్టివిటీని పెంపొందించేందుకు రెండు దేశాలు కృషి చేయాలని ప్రధాని మోడీ అన్నారు.
జీ-20లో ఆఫ్రికన్ యూనియన్ కు సభ్యత్వం విషయంలో సహకరించిన ప్రధాని మోడీకి ఫిలిప్ జసింటో నుయిషీ ధన్యవాదాలు తెలిపారు. గతేడాది జనవరి, నవంబర్లలో జరిగిన వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్లో ప్రెసిడెంట్ న్యుసి పాల్గొనడాన్ని ప్రధాన మంత్రి అభినందించారు.