మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Reservation Bill) కు పార్లమెంట్ (Parliament) లో ఆమోదం లభించడంపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లును సరైన దిశలో ఒక ముందడుగు అని ఆమె అభివర్ణించారు. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసిందని దానికి ఆమె ట్యాగ్ లైన్ పెట్టారు.
ఈ చారిత్రక మైలురాయితో కొత్త యుగానికి స్ఫూర్తినిస్తోందని ఆమె వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినీయమ్’ ను అమోదించడం అనేది నిజంగా సరైన దిశలో ముందడుగు అని ఆమె పేర్కొన్నారు. కానీ ఆ బిల్లును వేగవంతంగా, అత్యంత సమర్థవంతంగా అమలు చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందు వున్న తదుపరి దశ అన్నారు.
మహిళలకు నిజంగా మద్దతునిచ్చే, వారిని శక్తివంతం చేసే భారత్ ఇక్కడ ఉందన్నారు. అంతకు ముందు నటి కీర్తి కుల్ హరి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం అనేది దేశంలో జరిగిన అత్యద్భుతమైన విషయమన్నారు. ఇవి ఈ దేశం మొత్తానికి చారిత్రాత్మకమైన క్షణాలన్నారు.
రాబోయే సంవత్సరాల్లో లింగ సమానత్వం గల పరిస్థితులను ఈ బిల్లు ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కు తమను ఆహ్వానించి, ఈ చారిత్రాత్మక బిల్లులో తమను భాగస్వామ్యం చేసినందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రతి మహిళ గర్వించదగ్గ విషయమని నటి హృషిత భట్ అన్నారు.