జార్ఖండ్‌లో గిరిజన సీఎం అయిదేళ్లు పూర్తి చేసుకోవడం బీజేపీ (BJP)కి ఇష్టం లేదని, వాళ్ల పాలనలో దీన్ని జరగనివ్వరని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ( Hemant Soren)ఆరోపించారు. గత వారం ఈడీ తనను అరెస్టు చేయడంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమేయం ఉందని సోరెన్ ఆరోపించారు.
దమ్ముంటే తనపై ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత జనవరి 31న రాత్రి ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేశారని తెలిపారు. అది ప్రజాస్యామ్యంలో చీకటి అధ్యాయనమన్నారు. ఒక సీఎం అరెస్టు కావడం దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
తన అరెస్ట్ వెనుక రాజ్‌భవన్ ప్రమేయం ఉన్నదని తాను గట్టిగా నమ్ముతున్నానని వెల్లడించారు. 8.5 ఎకరాల భూ కుంభకోణం ఆరోపణలపై తనను అరెస్టు చేశారని అన్నారు. వారికి ధైర్యం ఉంటే తన పేరిట నమోదైన భూమికి సంబంధించిన పత్రాలు చూపించండని సవాల్ విసిరారు.
అది నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తాము ఇంకా ఓటమిని అంగీకరించలేదని చెప్పారు. తనను కటకటాల వెనక్కి నెట్టి విజయం సాధించగలమని వారు భావిస్తే అది సాధ్యం కాదన్నారు. భూస్వామ్య శక్తులకు త్వరలోనే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.