వివాదాస్పదమైన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఓఎస్డీ హరికృష్ణపై వేటు వేసిన సర్కార్.. ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించింది. హరికృష్ణ (Hari Krishna) స్థానంలో సుధాకర్ (Sudhakar) ను నియమించింది. ఈయన ప్రస్తుతం జింఖానా గ్రౌండ్ లో పనిచేస్తున్నారు. గతంలో జిల్లా యువజన క్రీడా అధికారిగా చేసిన అనుభవం ఉంది.
ఈ ఘటనపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ (Gopichand) మాట్లాడుతూ.. బాలికలపై వేధింపుల ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేశిక్షించకూడదని కోరారు. క్రీడల్లోకి ఆడపిల్లలు తక్కువగా వస్తున్నారని.. ఇలాంటి సమయంలో వేధింపులకు గురైతే తల్లిదండ్రులు వాళ్లను క్రీడల వైపు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
క్రీడాకారిణులకు భద్రత కల్పించడం అత్యవసరమని అన్నారు గోపీచంద్. హైదరాబాద్ (Hyderabad) లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో విద్యార్థినులపై ఓఎస్డీ (OSD) హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం హరికృష్ణను సస్పెండ్ చేసింది. విచారణకు ఆదేశించింది. అయితే.. ఆయన మాత్రం తనకెలాంటి పాపం తెలియదని అంటున్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులతో పూర్తిస్థాయి విచారణ జరుపుతామని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud). కేసీఆర్ పరిపాలనలో మహిళలపై వేధింపులను ఉపేక్షించేది లేదని తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.