పొట్టచేత పట్టుకుని బతుకుదెరువుకు నగరానికి వచ్చిన కార్మికులు అధికారుల నిర్లక్ష్యానికి బలయ్యారు. పురానాపూల్ మూసీ నది(Puranapool Musi River) పైప్ లైన్ ప్రాజెక్టు(Pipe line project) పనుల్లో అనుకోని ఘటన విషాదాన్ని మిగిల్చింది. డ్రైనేజీ మ్యాన్ హోల్స్‌లో విషవాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మృతిచెందారు.
ప్రాజెక్టు పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. కొంతకాలంగా పూరానాపూల్ మూసీ నది పరివాహక ప్రాంతంలో 1200 ఎమ్ఎమ్ పైప్ లైన్ పనులను అయ్యప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చేపట్టింది. ఈ క్రమంలో పురాణాపూల్ పాత బ్రిడ్జి సమీపంలో హనుమాన్ ఆలయం వద్ద మ్యాన్ హోల్స్ మెయింటెనెన్స్ పనులు కొనసాగుతున్నాయి.
మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన రాములు (50) చంపాపేట్‌లో ఉంటున్నాడు. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన హనుమంతు (42), వనపర్తి ప్రాంతానికి చెందిన శీను (40)లు కార్వాన్ లో ఉంటూ ప్రాజెక్ట్ వర్క్ పనుల్లో గత కొంతకాలంగా పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో మ్యాన్ హోల్స్ మెయింటెనెన్స్ వనులు చేస్తుండగా రాములు అందులోని విషవాయులు పీల్చడంతో స్పృహ తప్పిపోయాడు.
ఈ క్రమంలో అతన్ని కాపాడే ప్రయత్నంలో హనుమంతు, శ్రీనులు మ్యాన్‌హోల్‌లోని విషవాయులను పీల్చి మృతిచెందారు. రాములును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగి మ్యాన్‌హోల్‌లో చిక్కుకుపోయిన ఇద్దరి మృతదేహాలను బయటికి తీశారు. సమాచారం తెలుసుకున్న కులుసుంపుర పోలీసులు అయ్యప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.