‘వచ్చే ఎన్నికల్లో మా వ్యూహం మాకు ఉంటుంది.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా..’ అని బీజేపీ(BJP) ఏపీ(AP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeswari) ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆమె బుధవారం పర్యటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ సమీకరణాలపై ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పురంధేశ్వరి వెల్లడించారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తివాదులు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వస్తే ఆహ్వానిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. నాడు చంద్రన్న, నేడు జగనన్న అంటూ స్టికర్ అంటించి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబంలో ఒక్కరికే వైద్యం అందిస్తున్నారు. కానీ, ఆయుష్మాన్ భవ పథకం కింద ఒక్కొక్కరికి రూ.5లక్షల వరకు అందిస్తున్నామని వెల్లడించారు.
ఇక, రాష్ట్రానికే కాకుండా జిల్లాల వారీగా కేంద్ర సహకారం అందిస్తున్నారు పురంధేశ్వరి. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న ఆమె చంద్రయాన్ తీసిన మొదటి ఫొటోలో రోడ్డు దుస్థితి కనబడిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు నాలుగోడల మధ్య నేతలతో చర్చించి సన్నద్ధమవుతున్నామని, బీజేపీ సీట్ల కేటాయింపు కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.