నారాయణ గురూజీ (Narayana Guruji).. గొప్ప సంఘ సంస్కర్త. మూఢ విశ్వాసాలు, కులతత్వంపై నిరసన గళం వినిపించిన పోరాట యోధుడు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని నినదించారు. దేశంలోనే మొదటగా సర్వ మత సమ్మేళనాన్ని నిర్వహించారు. చదువుతోనే స్వేచ్ఛ, సమానత్వం సిద్ధిస్తాయని చెప్పిన మహనీయుడు నారాయణ గురూజీ.
1856 అగస్టు 20న కేరళ (Kerala) లోని తిరువనంతపురంలో జన్మించారు. తండ్రి మదన్ అసన్, తల్లి కుట్టియమ్మ. ఎజవా కులస్తులు కేవలం ఆయుర్వేదం చదవుకునేందుకు మాత్రమే సంస్కృతాన్ని ఉపయోగించే వారు. కానీ, వారందరికీ భిన్నంగా నారాయణ గురూజీ ఆయుర్వేదం, తత్వ శాస్త్రం, హిందూ మత గ్రంథాలను చదివారు.
ఎజవా కులస్తులను అవర్ణులుగా భావించే వారు. అందుకే, వారిని పాఠశాలలు, ఆలయాల్లోకి అనుమతించే వారు కాదు. ఈ నేపథ్యంలో తాను నేర్చుకున్న విద్య, జ్ఞానాన్ని అవర్ణుల పిల్లలకు బోధించేవారు. దీంతో ఎజవా కులస్తులతో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇళ్లు విడిచి వెళ్లిపోయారు నారాయణ గురూజీ.
వివక్షను రూపుమాపేందుకు మార్గాలను అన్వేషించారు. 1888లో తిరువనంతపురంలో అరవిప్పురం ప్రాంతంలో శివాలయాన్ని నిర్మించారు. ఆలయంలోకి దళితులు, అణగారిన వర్గాలకు ప్రవేశం కల్పించారు. అలా కేరళ, తమిళనాడు, కర్ణాటక, శ్రీలంకల్లో అనేక ఆలయాలను కట్టించారు. మనుషులందరిదీ ఒకే కులం.. అందరికీ ఒకే దేవుడు అని ఆలయ గోడలపై రాయించారు.