రామాయణం ఒక జీవిత సూత్రం. అందరికీ ఆదర్శ పాఠం. భారతీయ సంస్కృతికి ఆధారమైన కుటుంబ జీవనాన్ని సామాజిక ధర్మాన్ని సర్వాంగసుందరంగా చిత్రించిన మహా ఇతిహాసం. వ్యక్తుల మధ్య సంబంధాలు ఎంత ఉదాత్తస్థాయిలో ఉండాలో, అలా ఉంటే వారి జీవితం ఎలా భావితరాలకు ఆదర్శప్రాయమవుతుందో విశదీకరించింది రామాయణం. అయితే.. నిష్కల్మషమైన భ్రాతృభక్తికి పెట్టింది పేరు శ్రీరాముని సోదరుడు భరతుడు. ఈయనకు భారతదేశంలో ఒకే ఒక్క ఆలయం ఉంది.
మన దేశంలోని ప్రతీ గ్రామంలో రామాలయం ఉంటుంది. ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. కానీ, భరతుడికి ఓ ఆలయం ఉందని పెద్దగా ఎవరికీ తెలియదు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో ఇది ఉంది. శ్రీ కూడల్మాణిక్యం ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భరతుడిని సంగమేశ్వర అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. చుట్టూ కోనేరుల మధ్య ఇది కొలువైంది.
శ్రీరామ సోదరులందరికీ కేరళలో ఆలయాలు ఉన్నాయి. నలుగురి మందిరాల యాత్రను నాలాంబల అంటారు. మలయాళంలో అంబలం అంటే దేవాలయం. నాల్ అంటే నాలుగు. శ్రీరాముల వారితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నలు నలుగురు. వీరిని ఒకే రోజులో దర్శించుకోవడాన్ని నాలాంబల యాత్రగా పిలుస్తారు. కర్కాటక మాసం(జూన్ నుండి జులై) ఒకే రోజులో ఈ యాత్రను పూర్తి చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. వీటిలో భరతుడి ఆలయం చాలా విశిష్టమైనది.
ఇతర ఆలయాల మాదిరిగా ఇక్కడ దీపారధన ఉండదు. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భరతుడు శోకంలో మునిగిపోయాడని అందువల్లే ఈ ఆలయంలో దీపారాధన చేయరని చెబుతారు. పూజలో కర్పూరం కానీ, అగరవత్తులు కానీ వెలిగించరు. తామర, తులసి ఆకులతో మాత్రమే పూజిస్తారు. ఇతర పూలను వాడరు. విగ్రహానికి పూల మాలలు కూడా వేయరు. సాధారణంగా హిందూ ఆలయాల్లో కనిపించే పూజా దృశ్యాలేవీ భరతుడి ఆలయంలో కనిపించవు.
ఆలయానికి నాలుగు వైపులా కోనేరులు ఉంటాయి. వాటి నీటితోనే స్వామివారిని అభిషేకిస్తారు. నాలుగింటిలో అతి పెద్దది ‘కుట్టన్ కుళం’. 15వ శతాబ్దానికి ముందే కూడల్మాణిక్యం ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయం వాస్తుశైలి చాలా బాగుంటుంది. భారతీయ వాస్తుశైలికి అద్దం పడుతుంది. త్రిస్సూర్ కు దక్షిణంగా ఉన్న ఈ ఆలయం కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు ప్రయాణం అయితే ఇరింజలకుడలో రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుంచి 9 కి.మీ. ప్రయాణిస్తే ఆలయం వస్తుంది. రోడ్డు మార్గం ద్వారా అయితే త్రిస్సూర్ కు చేరుకుని అక్కడి నుంచి వెళ్లొచ్చు.