బీజేపీ (BJP) ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నవాళ్లలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఒకరని చెబుతుంటారు ఆపార్టీ నేతలు. కావాలని, ఏదో ఒక అంశాన్ని పట్టుకుని ట్విట్టర్ లో, మీడియా ముందు వాగుతుంటారని మండిపడుతుంటారు. తాజాగా మరోసారి వివాదం రాజుకుంది. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హోంశాఖ కలగజేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ ఏమన్నారు?
మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ.. దేశానికి తగిలిన గాయాలు రాచపుండులా మారుతాయన్నారు ప్రకాష్ రాజ్. హైదరాబాద్ (Hyderabad) లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆవిర్భావ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. నాయకుడిగా జోకర్ ని ఎన్నుకుంటే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమేనని విమర్శించారు. మణిపూర్ (Manipur) అంశంపై ప్రధాని మోడీ (Modi) మౌనం చుట్టూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఆయన్ను ఉద్దేశించి ఇలా మాట్లాడారు.
రఘునందన్ రియాక్షన్
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ట్విట్టర్ లో స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao). దేశ ప్రధాని గురించి జోకర్ అని అవహేళనగా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. 534 మంది పార్లమెంటు సభ్యులను “బంచ్ ఆఫ్ జోకర్లు” గా సంబోధించడం చాలా బాధాకరమన్న ఆయన.. ఇంతకుముందు కూడా ఇలా చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ప్రకాష్ రాజ్ పై వెంటనే హోంశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, భవిష్యత్తు ఎలక్షన్ లో పోటీ చేయడానికి అనుమతిని నిరాకరించాలని కోరారు. దేశం, ప్రధానమంత్రి , సమాజం పట్ల గౌరవం లేని ప్రకాష్ రాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.