ఎన్నికల (Election) ముందు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) ఒక్కటని కాంగ్రెస్ (Congress) వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. పొద్దున లేస్తే బీజేపీపై కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అవుతారంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం కేవలం బురద జల్లే ప్రయత్నమేనని ఆయన అన్నారు.
కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లు ఎవరైనా అప్రూవర్ ఎవరైనా మీకు చెప్పారా అని రేవంత్ రెడ్డికి ఆయన సూటి ప్రశ్న వేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన విషయం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పై ప్రభుత్వం ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తోందని నిలదీశారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకే రెండు పార్టీల నాయకులు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజల మనసును గాయపరిచేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకలాడుతోందన్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు పోతలేదో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
2023 కేసు కోసం మాట్లాడే కాంగ్రెస్ పెద్దలు అంతకంటే ముందు జరిగిన 2016 కేసులో ఎందుకు తెరమీదకు వస్తలేరని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా అరెస్టు చేయాలన్నారు. ఆ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు.