ముస్లింలకి అనుకూల తీర్పులను స్వాగతించడం, హిందువులకు అనుకూలంగా వస్తే వ్యతిరేకించడం బీఆర్ఎస్ వక్ర బుద్ధికి నిదర్శనమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. మంగళవారం (ఇవాళ) ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బిల్కిస్ బానో కేసు తీర్పుపై నిన్న కుహనా లౌకిక వాదులు కేటీఆర్, రాహుల్, కవితలు మాట్లాడారని అన్నారు. వారు మోడీని విమర్శించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారని, చెంప పెట్టు అని కామెంట్ చేశారని అన్నారు. రామ మందిర నిర్మాణం జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీం కోర్టు అని గుర్తు చేశారు.
అయితే బీఆర్ఎస్ ఎందుకు మీరు స్వాగతించడం లేదని? అని ప్రశ్నించారు. ‘మీరు ఎవరి వారసులు.. రావణుడి, శూర్పణఖ వారసులా’ అంటూ ప్రశ్నించారు. మీ నోళ్ళు ఎందుకు మెదపడం లేదంటూ మండిపడ్డారు. షబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రస్తుత చీఫ్ జస్టిస్ తండ్రి ఆ జడ్జ్ మెంట్ ఇచ్చారు భరణం ఇవ్వాలని ఆదేశించిందని అన్నారు.
సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌ను పక్కన పెడుతూ రాజీవ్ గాంధీ దానికి వ్యతిరేకంగా చట్టం తెచ్చారని తెలిపారు. ఒక కేసులో ఒక రకంగా ఇంకో కేసులో ఇంకో రకంగా స్పందించటం సెక్యులరిజం కాదని సూచించారు. జ్ఞాన వాపిపై కోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్వాగతించండని తెలిపారు. టేకుల లక్ష్మి అత్యాచారం జరిగి మర్డర్ జరిగితే కేటీఆర్, కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ ఒకటి కాదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆదేశిస్తేనే తాను వెళ్లి కేసీఆర్‌ను కలిశాను అని రేవంత్ రెడ్డి చెప్పారని, వాళ్లంతా ఒకటే అనడానికి ఇది నిదర్శనం రఘునందన్‌రావు అన్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుందని రఘునందన్ రావు చెప్పారు.