పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తున్న కొద్ది పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకొంటున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.. ప్రధానంగా తెలంగాణ (Telangana) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య నివురుగప్పిన నిప్పులా ఆరోపణలు కుంపటి పెడుతున్నాయని అంటున్నారు..
నేతలు అంతర్గత పొత్తులను బహిర్గతం చేయడం లేదు.. అసలు పొత్తులు ఉన్నాయో లేదో కూడా తెలియదు.. కానీ ఎవరికి వారే మీరంతా ఒక్కటే అంటూ ఆరోపణలు చేసుకోవడం కనిపిస్తోంది. తాజాగా మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి దుబ్బాక రఘునందన్ రావు (Raghunandan Rao).. కాంగ్రెస్, బీజేపీ పై ఫైర్ అయ్యారు. ఈ రెండు ఒక గూటి పక్షులే అని విమర్శించారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రెండు పార్టీలపై విరుచుకు పడ్డారు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నా కేసీఆర్ కనీసం పల్లెత్తు మాట కూడా అనడం లేదని అన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన రోజే ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ ఉండదని రఘునందన్ రావు పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాలతో బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పిన రఘునందన్.. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో ఓటమి పాలైన రఘునందన్ రావు.. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే ఆయన ప్రచారం మొదలుపెట్టారు.