కాంగ్రెస్ (Congress) ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) వీడియో ఒకటి వైరల్ (Viral) అవుతోంది. అందులో ఓ వాహనదారుడికి సాయం చేస్తూ ఆయన కనిపించారు. బుధవారం ఉదయం ఢిల్లీ (Delhi) లో పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్న సమయంలో ఇది జరిగింది.
రాహుల్ గాంధీ తన ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి కింద పడిపోయాడు. రాహుల్ కారు లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్న సమయంలో అతని వాహనం కంట్రోల్ తప్పింది. దీన్ని గమనించిన రాహుల్ వెంటనే అతని వద్దకు వెళ్లారు. స్కూటీని పైకిలేపి వాహనదారుడితో మాట్లాడారు. దెబ్బలు ఏమైనా తగిలాయేమోనని ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన తర్వాత నేరుగా పార్లమెంట్ కు వెళ్లారు రాహుల్. మోడీ సర్కార్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ప్రసంగించారు. మణిపూర్ అంశంపై మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తాను ఆ రాష్ట్రానికి వెళ్లి అక్కడి పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న బాధితులతో మాట్లాడానని, తమ బాధలను వారు కన్నీటితో చెప్పారని అన్నారు. ప్రధాని ఇప్పటివరకు మణిపూర్ ను ఎందుకు సందర్శించలేదని అడిగారు. ఆయన దృష్టిలో మణిపూర్ రాష్ట్రం కాదా అని ప్రశ్నించారు.
మణిపూర్ కు సైన్యాన్ని ఎందుకు పంపించడం లేదన్నారు రాహుల్. మణిపూర్ లో మీరు భరత మాతను హత్య చేశారు.. ఆ రాష్ట్ర ప్రజలను చంపి భరత మాతను కూడా చంపారు అని ఆవేశంగా వ్యాఖ్యానించారు. మీరు దేశ భక్తులు కారని, దేశ ద్రోహులని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఫైరయ్యారు.