కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ (Bharat Jodo Nyay Yatra)లోగో (Logo)ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోతో పాటు “న్యాయ్ కా హక్ మిల్నే తక్” ట్యాగ్‌లైన్‌ను ఆవిష్కరించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రను ఈ నెల 14 నుంచి ప్రారంభించనున్నట్టు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో మణిపూర్ లో ఈ యాత్రను ప్రారంభిస్తామని చెప్పారు. మొత్తం 15 రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. చివరగా ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని వివరించారు. మొత్తం 110 జిల్లాల్లో 337 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్రసాగుతుందన్నారు.
అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అన్యాయానికి, అహంకారానికి వ్యతిరేకంగా న్యాయం అనే నినాదంతో తాము ప్రజల మధ్యకు తిరిగి వస్తున్నామని చెప్పారు. తాను ఈ సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నానన్నారు. న్యాయం జరిగే వరకు ఈ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ కూడా ఓ వీడియోను ట్వీట్ చేసింది.
రైతులు, నిరుద్యోగులు, దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఓ వీడియోను షేర్ చేసింది. అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో తాము మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్నామని చెప్పింది. నియంతృత్వానికి, అహంకారానికి తగిన సమాధానం ఇవ్వడానికి కోట్లాది మంది దేశప్రజల ప్రేమ, ప్రార్థనలను తీసుకుంటూ ముందుకు వస్తున్నామని పేర్కొంది.