Rahul Gandhi : తన లోక్ సభ సభ్యత్వాన్నిలోక్ సభ సెక్రటేరియట్ పునరుద్ధరించడంతో కాంగ్రెస్ (Congress) అగ్ర నేత రాహుల్ గాంధీ మళ్ళీ లోక్ సభలో అడుగు పెట్టారు. ప్రధాని మోడీ (Modi) ప్రభుత్వంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం సభలో జరిగే చర్చలో ఆయన పాల్గొంటున్నారు. తమ పార్టీ పక్షాన మధ్యాహ్నం 12 గంటలకు ఆయన చర్చ మొదలు పెట్టవచ్చు.
సోమవారం ఆయన లోక్ సభలో ప్రవేశించగానే కాంగ్రెస్,ఇతర విపక్ష ఎంపీలు ఘనంగా స్వాగతం పలికారు. మొదట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్ప గుచ్చాలుంచి రాహుల్ లోక్ సభలో అడుగు పెట్టారు. ఇప్పటికే మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని, దీనిపై ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలని కోరుతున్న విపక్షాలు పార్లమెంట్ సభా కార్యకలాపాలను స్తంభింప జేస్తూ వచ్చాయి
. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చాయి. ఈ తీర్మానంపై ఈ నెల 8, 9, 10 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరగనుంది. 10 న మోడీ.. చర్చకు సమాధామివ్వనున్నారు.
రాహుల్ రాకతో విపక్షాల కూటమి ‘ఇండియా’ సభ్యుల్లో ఉత్సాహం పెరిగింది. మంగళవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభలూ వాడిగా, వేడిగా సాగే అవకాశాలున్నాయి.