Rahul Gandhi :ప్రధాని మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద బుధవారం కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభలో చర్చను ప్రారంభించారు. మొదట తన భారత్ జోడో యాత్ర సందర్భంగా తనకు కలిగిన అనుభవాలను ఆయన వివరించారు. ఆ తరువాత మణిపూర్ అంశంపై మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తాను ఆ రాష్ట్రానికి వెళ్లి అక్కడి పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న బాధితులతో మాట్లాడానని, తమ బాధలను వారు కన్నీటితో చెప్పారని అన్నారు. ప్రధాని ఇప్పటివరకు మణిపూర్ ను ఎందుకు సందర్శించలేదన్నారు.
ఆయన దృష్టిలో మణిపూర్ ఈ రాష్ట్రం కాదా అని ప్రశ్నించారు. మణిపూర్ కు సైన్యాన్ని ఎందుకు పంపించడం లేదన్నారు. మణిపూర్ లో మీరు భరత మాతను హత్య చేశారు.. ఆ రాష్ట్ర ప్రజలను చంపి భరత మాతను కూడా చంపారు అని ఆవేశంగా వ్యాఖ్యానించారు. మీరు దేశ భక్తులు కారని, దేశ ద్రోహులని ఆరోపించారు.
ఈ దశలో బీజేపీ ఎంపీలు ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూ నినాదాలు చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ..మోడీని రావణుడితో పోల్చారు. అహంకారి గనుకే రావణుడు ప్రజల వాణిని వినలేదన్నారు. లంకను కాల్చింది హనుమంతుడు కాదని, రావణుడి అహంకారమే కాల్చివేసిందన్నారు.
ఆ అహంకారమే అతడిని పొట్టన బెట్టుకుందన్నారు. మణిపూర్ కి సైన్యాన్ని పంపిన పక్షంలో ఒక్క రోజులో అక్కడ పరిస్థితి చక్కబడవచ్చునని రాహుల్ అభిప్రాయపడ్డారు. కాగా రాహుల్ ప్రసంగంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.